దళిత బంధు నిధులు విడుదల చేస్తారా? చేయరా?

*దళిత బంధు నిధులు విడుదల చేస్తారా? చేయరా? : లబ్ధిదారుల ఆవేదన*

దళితబంధు లబ్ధిదారులు డోలాయమానంలో పడ్డారు. పథకం కింద ఇప్పటికే యూనిట్లు ఎంపిక చేసుకున్న వారు మిగిలిన నిధులు వస్తాయో? రావో? తెలియక మథనపడు తున్నారు.

గత ప్రభుత్వం దళితబంధు కింద ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల చొప్పున ఆర్థికసాయం అందించడమే కాకుండా జీవనోపాధిని ఎంచుకునే స్వేచ్ఛ కల్పించింది. రూ. 10 లక్షలతో ఒకేసారి భారీ యూనిట్‌ను ఎంచుకోవడం కాకుండా లాభదాయకంగా ఉండే బహుళ యూనిట్లను ఎంచుకునేలా ప్రోత్సహించింది.


ఇందులో భాగంగా 200కుపైగా యూనిట్లను గుర్తించింది. వీటిలో డెయిరీ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఇటుకల తయారీ, పేపర్‌ ప్లేట్ల తయారీ, క్యాటరింగ్‌, ఇంజినీరింగ్‌ వర్క్స్‌, ఫర్నిచర్‌ తయారీ వంటివి ఉన్నాయి.

తొలి విడతలో దళితబంధు పథకం కింద మొత్తం 38,323 దళిత కుటుంబాలను ఎంపికచేసిన ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 10 లక్షల చొప్పున జమచేసింది. లబ్ధిదారుల్లో కొందరు ఐదేసి లక్షలతో రెండేసి యూనిట్లు ఏర్పాటుచేసుకోగా.

దాదాపు 2 వేలమంది రెండో యూనిట్‌ ఏర్పాటు చేసుకునే సమయంలో ఎన్నికల కోడ్‌ రావడంతో నిధుల విడుదల ప్రక్రియ నిలిచిపోయింది. ఎన్నికలు ముగిసి, కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు దాటినా రెండో యూనిట్‌కు సంబంధించి నిధులు విడుదల కాకపోవడంతో లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది.

*నిధులు విడుదల చేస్తారా? చేయరా? అన్న సందేహం వారిని వేధిస్తున్నది*

బ్యాంకుల్లోనే నిధులు

దళితబంధు లబ్ధిదారులు ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాను తెరవాల్సి ఉంటుంది. ప్రభుత్వం అందులోనే డబ్బులు జమచేస్తుంది. డబ్బును విత్‌ డ్రా చేసుకునేందుకు ప్రభుత్వం కొన్ని షరతులు విధించింది.

నిధులు దుర్వినియోగం కాకుండా డెబిట్‌కార్డులు, చెక్‌బుక్‌లు, ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్లకు అవకాశం లేకుండా చేసింది. లబ్ధిదారుడు యూనిట్‌ను ఎంపికచేసుకుని అందుకు సంబంధించిన కంపెనీల నుంచి కొటేషన్‌ తీసుకుని దానిని కలెక్టర్‌కు అందిం చాల్సి ఉంటుంది.

ఆయన దానిని పరిశీలించి సదరు కంపెనీ పేరుపై డీడీ చెల్లించాలని బ్యాంకుకు ఆదేశాలు జారీచేస్తారు. ప్రస్తుతం బ్యాంకుల్లో నిధులున్నా వాటి విడుదలకు ఆదేశాలు జారీచేయకపోవడంతో యూనిట్లు నెలకొల్పలేక పోతున్నారు.

స్పష్టతనివ్వండి రెండో యూనిట్‌ కోసం అన్నీ సిద్ధం చేసుకుని అధికా రులకు కొటేషన్లు ఇచ్చినా నిధులు ఇంకా విడుదల కాలేదని లబ్ధిదారులు వాపోతు న్నారు.

Comments