సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో అపశ్రుతి.. గోడకూలి 9 మంది భక్తులు మృతి

సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో అపశ్రుతి.. గోడకూలి 9 మంది భక్తులు మృతి


విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో 9 మంది మృతి చెందారు.


మరికొందరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, అధికారులు ఆస్పత్రికి తరలించారు. సింహగిరి బస్టాండ్ నుంచి పైకి వెళ్లే రూట్‌లో కొత్త షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర గోడ కూలింది. 

300 రూపాయల క్యూలైన్‌లో మెట్లు ఎక్కుతుండగా ఒక్కసారిగా కూలిపోయింది భారీ గోడ. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యల్లో ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక టీమ్స్ పాల్గొన్నాయి.

గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు చిద్రమయ్యాయి. శిథిలాల కింద మరికొందరు ఉండొచ్చన్న అనుమానంతో 10కి పైగా అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచారు. గోడ కూలిన ఘటనా స్థలాన్ని పరిశీలించారు హోంమంత్రి అనిత, కలెక్టర్, సీపీ. సహాయక చర్యలను దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు. భక్తులు ఎలాంటి ఆందోళన చెందొద్దన్నారు.

ఏటా ఒక్కసారి మాత్రమే నిర్వహించే సింహాచలం అప్పన్న చందనోత్సవానికి భారీగా తరలివస్తారు భక్తులు. 2 లక్షలకు పైగా భక్తులు బుధవారం స్వామివారిని దర్శించుకుంటారని అంచనా వేశారు అధికారులు. 

అర్థరాత్రి నుంచే భక్తులు పోటెత్తారు. 3గంటల నుంచి దర్శనం కల్పించడంతో క్యూలైన్లలో కిక్కిరిసిపోయారు భక్తులు. అయితే.. ఉరుములు మెరుపులతో కుండపోత వాన కురవడంతో ఒక్కసారిగా గోడ కూలి.. అప్పన్న సన్నిధిలో మహా విషాదం చోటు చేసుకుంది.



విషాదానికి కారణాలపై విచారణకు ఆదేశించారు దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని.. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. . గోడ నిర్మాణం, నాణ్యతపై విచారణ జరిపిస్తామన్నారు హోంమంత్రి అనిత.

సింహాచలం ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోడ కూలి భక్తులు మృతిచెందడం తనను కలచివేసిందంటున్నారు.. ఘటనపై కలెక్టర్‌, ఎస్పీతో మాట్లాడారు సీఎం చంద్రబాబు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

సింహాచలంలో యధా విధిగా అప్పన్పస్వామి చందనోత్సవ వైభవంగా సాగుతోంది. స్వామివారు నిజరూప దర్శనంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు తొలి దర్శనం చేసుకున్నారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు.

తెల్లవారుజామున సుప్రభాత సేవ తర్వాత మూలవిరాట్‌కి చందనం తొలగించారు. అభిషేకాల తర్వాత అప్పన్నకు..తొలి చందనం సమర్పించారు అనువంశిక ధర్మకర్త అశోక్‌ గజపతిరాజు. ప్రభుత్వం తరఫున, TTD తరఫున స్వామివారికి పట్టువస్త్రాల సమర్పించారు.

దర్శనానికి మరో మార్గం ఏర్పాటు చేశారు అధికారులు. రూ.1500 క్యూలైన్‌ను ఆనుకుని మరో క్యూలైన్‌లో భక్తుల్ని అప్పన్న దర్శనాలకు పంపుతున్నారు.

Comments