విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్ కు తప్పిన ప్రమాదం
ఆదివారం రాత్రి కురిసిన అకాల వర్షానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడగా ఆసమయంలో విధులు నిర్వహిస్తున్న లైన్ ఇన్స్పెక్టర్ గడ్డి కొప్పుల రాములు అనే వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.
పూర్తి వివరాల్లోకెళితే మండలంలోని గోపాలపురం గ్రామానికి చెందిన రాములు, తిరుమలాయపాలెం, పిండిప్రోలు విద్యుత్ సబ్ స్టేషన్ల పరిధిలో లైన్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఆదివారం రాత్రి కురిసిన అకాల వర్షం, గాలి దుమ్ము కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.
వర్షంలో ద్విచక్ర వాహనం పై విధులు నిర్వహించడం ఇబ్బందిగా ఉంటుతుందని, రాములు తన కార్లో వచ్చి విధులు నిర్వహిస్తున్నాడు.
తిరుమలాయపాలెం గ్రామంలో ఖమ్మం - వరంగల్ ప్రధాన హైవే పక్కనే విద్యుత్ సబ్ స్టేషన్ ఉండగా, తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో రాములు ఆఫీస్ నుంచి తనకారులో బయలుదేరి హైవేపైకి చేరుకున్నాడు.
ఈ క్రమంలోనే మరిపెడ బంగ్లా నుంచి ఖమ్మం వైపుగా వెళ్తున్న లారీ ఆర్సీఎం చర్చి ఎదురుగా రాములు కారును వెనక నుంచి వేగంగా ఢీ కొట్టింది.
దీంతో కారు వేగంగా దూసుకెళ్లి రోడ్డు సైడ్ 11 కేవీ విద్యుత్ స్తంభం, టెలిఫోన్ స్థంబానికి బలంగా ఢీ కొట్టి బోల్తా పడింది. దీంతో రెండు స్తంభాలు సైతం విరిగిపడ్డాయి.
భారీ శబ్దం రావడంతో అదే సమయంలో ఆఫీసులో ఉన్న ఏఈఈ రవి, ఇతర సిబ్బంది వెంటనే ప్రమాద స్థలానికి చేరుకొని కారులో ఉన్న రాములును బయటికి తీశారు.
కారుకు ప్రమాదం జరిగిన తీరు భయానకంగా ఉన్నదని.. ప్రమాదంలో రాములు స్వల్ప గాయాలతో బయటపడడం అదృష్టమని, అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Post a Comment