ఆర్ఎంపీ వైద్యుడి నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి!
ఆర్ఎంపీ వైద్యుడి నిర్లక్ష్యంతో వ్యక్తి మృతిచెందిన ఘటన శుక్రవారం యాదగిరిగుట్టలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
యాదగిరిగుట్టకి చెందిన అన్నారం శివశంకర్ (26) పట్టణంలోని యోగానంద నిలయంలో వెనుక ప్రాంతంలో సెలూన్ షాప్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం ఉదయం కడుపునొప్పితో పాటు ఛాతి పట్టివేస్తున్నట్లుగా అనిపించడంతో స్థానికంగా ఉన్న ప్రశాంత్ నర్సింగ్ హోమ్‌కు వెళ్లాడు.
వెంటనే అక్కడి ఆర్ఎంపీ వైద్యుడు ఉపేందర్ కడుపునొప్పికి సంబంధించి చికిత్స చేశాడు. కడుపునొప్పి తగ్గడంతో మూత్రం వస్తుందని బెడ్ పైనుండి లేచి వెళ్తున్న క్రమంలో శివశంకర్ ఒక్కసారిగా కుప్పకులాడు.
ఆర్ఎంపీ వెంటనే అప్రమత్తమై వ్యక్తికి అక్సిజన్ అందిస్తూ గంటపాటు పరిశీలనలో ఉంచాడు. కాగా నొప్పి తగ్గక పోవడంతో పాటు చాతి కుడి వైపు విపరీతంగా నొప్పికి గురికావడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు.
ఆలస్యంగా గుండెనొప్పిని పసిగట్టిన వైద్యుడు మెరుగైన చికిత్స కోసం భువనగిరికి తరలించాలని సూచించాడు. బందువులు 108కు ఫోన్ చేయగా అంబులెన్స్ అలస్యంగా వచ్చింది. అదే అంబులెన్స్‌లో భువనగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిన్నట్లు అక్కడి వైద్యులు ధృవీకరించారు.
మృతదేహాంతో ఆస్పత్రి వద్ద బంధువుల ధర్నా
శివశంకర్ మృతికి ప్రశాంత్ నర్సింగ్ హోం డైరక్టర్, ఆర్ఎంపీ వైద్యుడు ఉపేందర్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ బంధువులు మృతదేహంతో ఆస్పత్రి వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. శివశంకర్‌కు భార్య, కుమారుడు ఉన్నారు.
ఇంటి పెద్దదిక్కు కోల్పోవడంతో వారి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందంటూ, కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు వైద్యుడు ఉపేందర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఈ విషయమై వైద్యుడిని వివరణ కోరగా శివశంకర్ కడుపునొప్పి, ఛాతి బరువుగా ఉందని ఆస్పత్రి రాగా చికిత్స అందించా. వెంటనే కడుపునొప్పికి సంబంధించిన ఇంజక్షన్‌ను గ్లూకోజ్ బాటిళ్లతో కలిపి ఇచ్చా. మొదటగా నొప్పి తగ్గిందని చెప్పాడు. ఆ వెంటనే ఛాతి నొప్పి అంటూ వివరీతంగా ఇబ్బంది పడ్డాడు.
20 నిమిషాల అనంతరం అతనికి గుండె నొప్పి అని పసిగట్టా. వెంటనే మెరుగైన వైద్యం కోసం భువనగిరికి తరలించాలని సూచించా. అంబులెన్స్ అలస్యంగా వచ్చింది. ఒక వైద్యుడిగా తాను చేయాల్సింది చేసినట్లు, తన తప్పేమి లేదని తెలిపాడు.
Comments
Post a Comment