మే 31 ఛలో సిద్దేశ్వరం

*మే 31 ఛలో సిద్దేశ్వరం*

రాయలసీమ సాగునీటి హక్కల సాధనే లక్ష్యంగా ప్రజా బహిరంగ సభ 

వేలాదిగా తరలిరావాలని ప్రజలకు పిలుపునిచ్చిన బొజ్జా దశరథరామిరెడ్డి.

శ్రీశైలం రిజర్వాయర్ వద్ద పెద్ద గోతి పడినా … అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినా.. అలుగునూర్ రిజర్వాయర్ తెగిపోయినా …

గోరుకల్లు రిజర్వాయర్ కట్టలు కుంగిపోయినా..

తుంగభద్ర ప్రాజెక్టుల గేట్లకు భద్రత లేకున్నా వాటి పటిష్ట భద్రతకై నేటి వరకు పాలకులలో ఏ మాత్రం చలనం లేదని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి తీవ్రంగా విమర్శించారు.

సిద్దేశ్వరం అలుగు ప్రజా శంఖుస్థాపన 9 వ వార్షికోత్సవం సందర్భంగా రాయలసీమ సాగునీటి సాధన సమితి నంద్యాల జిల్లా సంగమేశ్వరంలో  మే 31 న నిర్వహిస్తున్న ప్రజా బహిరంగసభ నిర్వహిస్తున్న నేపథ్యంలో గురువారం నంద్యాల సమితి కార్యాలయంలో బొజ్జా ఒక ప్రకటన విడుదల చేసారు. 

రాయలసీమలోని అనేక ప్రాజెక్టుల ప్రధాన కాలువల, ఉపకాలువల, పంట కాలువల, డిస్ట్రిబ్యూటరీల రూపురేఖలే లేకుండా చిద్రమైపోయినాయనీ,

ప్రపంచ వారసత్వం సాగునీటి ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన కేసీ కెనాల్ ఆయకట్టుకు నీరు ఎంతవరకు ఇస్తారో భరోసా ఇచ్చే పరిస్థితులు లేకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఎనిమిది దశాబ్దాల కిందట నిర్మాణం అయిన తుంగభద్ర ఎగువ కాలువ, తుంగభద్ర దిగువ కాలువల కింద హక్కుగా ఉన్న 4,36,000 ఎకరాల ఆయకట్టు భూమిలో కేవలం 1,30,000 ఎకరాల ఆయకట్టుకు మాత్రమే నేటికీ నీరు  లభిస్తుండడం రాయలసీమ పట్ల పాలకుల వివక్షతకు నిదర్శనం కాదా అని ప్రశ్నించారు.

నాలుగు దశాబ్దాల కింద నిర్మాణం మొదలైన తెలుగుగంగ, గాలేరునగరి, హంద్రీనీవా, వెలుగొండ ప్రాజెక్టులు పాలకుల నిర్లక్ష్యం వలన ఇంకా మూడు దశాబ్దాలైనా పూర్తి అయ్యే పరిస్థితులు లేకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

రాయలసీమలోని అనేక చెరువుల తూముల, అలుగుల, కట్టల అధోగతి పాలైనా వాటి మరమ్మత్తులకు నిధుల మంజూరుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని విమర్శించారు.

గుండ్రేవుల రిజర్వాయర్, ఆర్డీఎస్ కుడి కాలువ, వేదవతి ఎత్తిపోతల పథకాలకు  శంకుస్థాపన చేసిన పాలకులు  నిర్మాణాలను ఎందుకు కొనసాగించడం లేదని అయన ప్రశ్నించారు.  

హామీలు ఇచ్చిన సిద్దేశ్వరం అలుగు, సీడ్ హబ్, హార్టికల్చర్ హబ్ తదితర అంశాలపై పాలకులు కేవలం ప్రకటనలకే పరిమితమైనారే తప్ప ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ఎలాంటి కార్యాచరణ చేపట్టకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు.

రాష్ట్ర విభజన చట్టంలో వెనుకబడిన జిల్లాలకు ఉన్న ప్రత్యేక ప్యాకేజీ, కడప ఉక్కు, జాతీయస్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయం,  అనంతపూర్ లో AIIMS, గుంతకల్లు రైల్వే తదితర అంశాల పట్ల అత్యంత నిర్లక్ష్యంగా పాలకులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పట్టిసీమ ద్వారా ఆదా అయిన కృష్ణా జలాలు రాయలసీమకు ఇవ్వకపోగా... రాయలసీమ హక్కుగా ఉన్న కృష్ణా జలాలు శ్రీశైలం ప్రాజెక్టు దాటి సముద్రంపాలవుతున్నా …

90 లక్షల ఎకరాల ఆయకట్టుకు సరిపడే కృష్ణా జలాలను సముద్రంలో పారబోస్తూ… రాయలసీమలో హక్కులు ఉన్న ప్రాజెక్టుల క్రింద ఉన్న ఆయకట్టు భూములకు చివరి తడికి నీరు అందించక ఎండిపోయే పరిస్థితులతో తల్లడిల్లిపోతున్న రైతులు, రాయలసీమ పంట పొలాలు బీడు భూములుగా మారడంతో, రైతులు, పొట్డ కూటి కోసం వలస బాట పట్టిన రైతు కూలీల దీనస్థితి పాలకులకు కనిపించడం లేదా అని సూటిగా ప్రశ్నించారు.

రాయలసీమలో 1500 కోట్ల రూపాయలు నిధులు ఖర్చు పెడితే వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి 10 లక్షల ఎకరాలలో సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయల వ్యవసాయ ఉత్పాదన చేసే అవకాశం ఉన్నప్పటికీ రాయలసీమకు నిధులు విడుదల చేయకుండా ప్రతిపాదనలతో కాలం గడుపుతూ రాయలసీమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు.

రాయలసీమలో కార్యాలయాల ఏర్పాటు అటుంచి, ఉన్న కార్యాలయాలను కూడా ఎత్తుకుపోతున్నా …

కీలకమైన కృష్ణానది యాజమాన్య బోర్డు కూడా అమరావతిలో ఏర్పాటు చేసుకుంటూ …

లక్ష కోట్ల రూపాయల నిధులను అమరావతిలో ఖర్చు పెడుతూ... 

దాన్ని ఆర్థిక, వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చేస్తూ ....

అభివృద్ధి, ఉద్యోగం, ఉపాధి అవకాశాలన్నీ ఆ ప్రాంతం వారికి కలగ చేస్తూ… రాయలసీమ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కూడా లేకుండా చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు.



రాయలసీమను మభ్యపరిచే  దిశగా  "గోదావరి - బనకచర్ల" ను చేపట్టడమే కాకుండా, పదకొండేళ్ళ నుంచి ప్రత్యేక ప్యాకేజి నిధులను అడగకుండా మౌనంగా వున్న పాలకులు ఆ నిధులను   "గోదావరి - బనకచర్ల" అనుసంధానానికి మళ్లించే దిశగా పాలకులు అడుగులు వేస్తున్నారని అన్నారు.

ఇంకా ఎన్నేళ్లు మౌనంగా ఉందామనీ వెనకబడిన ప్రాంతాల నిర్లక్ష్యం పట్ల పాలకుల వైఖరిని  ప్రశ్నించేలాగా ప్రజలందరూ చైతన్యవంతులవ్వాలని అన్నారు.

రాయలసీమ ప్రగతి చేపట్టేలాగా పాలకులపై ఒత్తిడి తెద్దాం …

ప్రతి గడప నుంచి సిద్దేశ్వరానికి కదులుదాం ... 

వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి సాధన ఉద్యమంలో భాగస్వామ్యులవుదాం ..మే 31 న సంగమేశ్వరంలో జరిగే ప్రజా బహిరంగసభ విజయవంతానికై ప్రజలు వేలాదిగా తరలిరావాలని బొజ్జా ప్రజలకు పిలుపునిచ్చారు.

Comments