భర్త మరణాన్ని తట్టుకోలేక..కొడుకుతో కలిసి మహిళ ఆత్మహత్య
నిజాంసాగర్ ప్రాజెక్టులో తల్లి కొడుకులు దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎస్సై శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ మండలం మునిగేపల్లి గ్రామానికి చెందిన దార ప్రమీల (30), దార అక్షయ్ (8) అనే తల్లి కొడుకులు నిజాంపేట్ మండల కేంద్రంలోని బ్యాంకుకు వెళ్లి వస్తామని ఇంట్లో చెప్పి నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వచ్చి ప్రాజెక్టు 20గేట్ల గోలి వద్ద నీటిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. గురువారం ఉదయం ప్రమీల, అక్షయ్ ల మృతదేహాలు నిజాంసాగర్ ప్రాజెక్టులో చేపలు పట్టే వారికి కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో ఎస్ఐ శివకుమార్ పోలీస్ సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను ఒడ్డుకు తీయించి నిజాంపేట్ మండలం మునిగేపల్లి గ్రామానికి చెందిన దార ప్రమీల, అక్షయ్ లుగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
దార ప్రమీల భర్త దార సాయిలు గత 20రోజుల క్రితం అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని, దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ప్రమీల జీవితంపై విరక్తి చెందిందని, ప్రమీలకు 12 సంవత్సరాల కూతురు నిహారిక, 8 సంవత్సరాల కుమారుడు అక్షయ్ లు ఉండగా తన కుమారుడు అక్షయ్ తో కలిసి ప్రాజెక్టుకు వచ్చి ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.
మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై శివ కుమార్ తెలిపారు.
Comments
Post a Comment