త్వరలోనే గ్రూప్స్ ఉద్యోగాలు.. 1,161 పోస్టులు భర్తీ..
తెలంగాణ నీటిపారుదల శాఖకు కొత్తగా ఎంపికైన ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో వారిని ఉద్దేశించి ప్రసంగించారు.
ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో ఏఈ, జేటీవో ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశారు. ప్రాజెక్టుల నాణ్యత విషయంలో ఇంజినీర్లు ఎలాంటి ఒత్తిళ్లకు లొంగవద్దని సూచించారు.
గడిచిన 15 నెలల్లో నీటి పారుదల శాఖలోనే 1,161 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశామని చెప్పారు. గ్రూప్ 1 నియామకాలను అడ్డుకోవడం వెనక ఉన్న రాజకీయ నాయకులు ఎవరో అందరికీ తెలుసని.. త్వరలోనే గ్రూప్స్ ఉద్యోగాల నియామకాలు పూర్తి చేస్తామని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.
నీళ్ల అవసరమే తెలంగాణను సాధించిందన్న రేవంత్.. గతంలో తెలంగాణ ఉద్యమాన్ని భావోద్వేగంగా మార్చి రాజకీయ ప్రయోజనం పొందారన్నారు. అనేక విషయాలపై ముక్కుసూటిగా మాట్లాడిన రేవంత్ రెడ్డి అనేక విషయాలపై సమగ్రంగా వివరించారు. విపక్ష బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు సెటైర్లు వేస్తూ ముప్పేటదాడి చేశారు.
అటు ఉద్యోగుల గురించి కూడా సీఎం రేవంత్ కుండబద్ధలు కొట్టారు. "ఎవరు చేయాల్సిన పని వారు చేయాలి. నాయకులు చెప్పారని చేస్తే అధికారులు ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుంది. అప్పటి సీఎం హెలికాప్టర్లో వెళుతూ ఎక్కడ ప్రాజెక్టు కట్టాలో చెప్పారట. విజిలెన్స్ NDSA నివేదికల్లో అధికారులను ఉరితీయాలని చెప్పారు."
"ప్రాజెక్టు ఎలా కట్ట కూడదో కాళేశ్వరంను చూసి తెల్సుకోవాలి. ఎలా నిర్మించాలో నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను చూసి నేర్చుకోవాలి. కొందరు కోర్టులో కేసులు వేసి ఉద్యోగ నియామకాలు అడ్డుకుంటున్నారు. గ్రూప్ వన్ పరీక్షలకు ఏర్పాట్లు అన్ని పూర్తి అయ్యాయి.
కానీ కొందరు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారు. నీళ్లు మన నాగరికత.. నీళ్ల కోసమే తెలంగాణ ఉద్యమం పుట్టింది. నీళ్ల కోసం మొదలైన మన ఆకాంక్షనే రాష్ట్రాన్ని సాధించి పెట్టింది. ఇది ఉద్యోగం కాదు.. ఒక భావోద్వేగం.. ఆ భావోద్వేగానికి మీరే ప్రతినిధులు. భావోద్వేగంతో కొన్ని పార్టీలు రాజకీయ లబ్ది పొందాయి." అని సీఎం రేవంత్ అన్నారు.
" రెండు లక్షల కోట్లు ఖర్చుపెట్టినా తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో మొదలు పెట్టిన ప్రాజెక్టులు పూర్తి కాలేదు. గతంలో కట్టిన సాగునీటి ప్రాజెక్టులు ఎన్ని ఉపద్రవాలు వచ్చినా ఇప్పటికీ చెక్కు చెదరలేదు. కానీ కాళేశ్వరం మూడేళ్ళలోనే కట్టడం, కూలడం రెండూ జరిగిపోయాయి.
ఎలా కట్టకూడదో, ఎలా కడితే ప్రజలకు నష్టం జరుగుతుందో అనే దానికి ఉదాహరణ కాళేశ్వరం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు కట్టిన చోట కనీసం సాయిల్ టెస్ట్ చేయలేదు. 80 వేల పుస్తకాలు చదివిన వ్యక్తి ఇంజనీరుగా మారి కట్టిన కాళేశ్వరం పరిస్థితి ఇది. త్వరలోనే గ్రూప్స్ ఉద్యోగాల నియామకాలు పూర్తి చేస్తాం" అని సీఎం రేవంత్ అన్నారు.
జలసౌధలో కొలువుల పండుగ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
నీటిపారుదల శాఖలో కొత్తగా నియమితులైన AE, JTO లకు సీఎంఈ సందర్భంగా నియామక పత్రాలు అందజేశారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్న మీ అందరికీ అభినందనలు. అని సీఎం కొత్త ఉద్యోగులను సాదరంగా ఆహ్వానించారు.
Comments
Post a Comment