పాకిస్తాన్కు మోదీ వార్నింగ్...
ఆపరేషన్ సిందూర్ పై ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు. భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ అనంతరం.. ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ త్రివిధ దళాధిపతులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
మోడీ నివాసంలో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ ముగియలేదని అన్నారు. పాకిస్తాన్ మళ్లీ కాల్పులు జరిపితే.. భారత్ కూడా తిరిగి అదే స్థాయిలో కాల్పులు జరుపుతుందని.. ఇందులో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేశారు.
ఈ మేరకు త్రివిధ దళాలకు కూడా కీలక ఆదేశాలు జారీ చేశారు. కశ్మీర్ విషయంలో భారత్ వైఖరి ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుందని అన్నారు. భవిష్యత్‌లో ఉగ్రదాడులు జరుగకుండా ఉండాలంటే.. పీవోకేను భారత్‌కు అప్పగించడం తప్ప మరో మార్గం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ విషయంలో ఇంతకు మించి మాట్లాడేదేం లేదని అన్నారు. పీవోకే అంశంలో మధ్యవర్తులు మాట్లాడొద్దు అని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.
పెహల్గాం ఉగ్రవాదులను అప్పగించే విషయంపై పాకిస్తాన్ మాట్లాడితే తాము కూడా మాట్లాడుతామని అన్నారు. ఈ అంశం తప్ప వేరే అంశంపై చర్చించే ఉద్దేశం తమకు లేదని కుండబద్దలు కొట్టారు. ఎవరి మధ్యవర్తిత్వం కూడా అవసరం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, రేపు పాకిస్తాన్‌తో చర్చల వేళ ప్రధాని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.
Comments
Post a Comment