మురళీ నాయక్ తల్లిదండ్రులను ఓదార్చిన డిప్యూటీ సీఎం,లోకేష్..
దేశం కోసం సరిహద్దులో పాకిస్థాన్ సైన్యంతో పోరాడుతూ అమరుడైన తెలుగు వీరజవాను మురళినాయక్ అంత్యక్రియలు నేడు (ఆదివారం) జరగనున్నాయి. మురళి నాయక్ భౌతికకాయం బెంగళూరు ఎయిర్ పోర్టు నుంచి శనివారం సాయంత్రం స్వగ్రామానికి చేరుకుంది.
మార్గం మధ్యలో అడుగడుగునా మురళీ నాయక్ భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు భారీ ఎత్తున ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు.
పాక్ సేనల దుశ్చర్యలను అడ్డుకుంటూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాను మురళీ నాయక్ అంత్యక్రియలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, మంత్రి సవిత, పలువురు నేత హాజరయ్యారు. మురళీ నాయక్ భౌతికకాయానికి నివాళి అర్పించారు.
శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాండాకు వెళ్లిన మంత్రి నారా లోకేష్ అమరుడైన జవాను మురళీ నాయక్ కుటుంబసభ్యులను పరామర్శించారు. దేశం కోసం తెలుగు బిడ్డ ప్రాణాలకు తెగించి పోరాడటం తెలుగు ప్రజలకు గర్వకారణం అన్నారు. అలాంటి వీరుడ్ని దేశం కోసం అందించిన మురళీనాయక్ కుటుంబసభ్యులను మంత్రి నారా లోకేష్ అభినందించారు.
పవన్ కళ్యాణ్ రాగానే మురళీ నాయక్ తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు. దేశం కోసం సరిహద్దుకు వెళితే ఇలా పొట్టన పెట్టుకున్నారని చెప్పి కన్నీటి పర్యంతమయ్యారు. తమ కడుపుకోత, ఆవేదనను చెప్పుకున్నారు. ఈ కష్టకాలంలో ఏపీ ప్రభుత్వం మురళీ నాయక్ కుటుంబానికి అండగా ఉంటుందన్నారు పవన్ కళ్యాణ్.
యావత్ భారతావని వీరుల త్యాగాలను గుర్తుంచుకుంటుందని, అందులో ఏపీ వాసి మురళీ నాయక్ ఒకరు. గుమ్మయ్యగారిపల్లి నుంచి భారీ ర్యాలీని నిర్వహించిన అనంతరం వీర జవాను మురళీ నాయక్ అంత్యక్రియలు అధికారిక, సైనిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. మురళీ నాయక్ అంత్యక్రియలకు హోంమంత్రి అనిత, పలువురు నేతలు హాజరు కానున్నారు.
ఆపరేషన్ సిందూర్ ఆపరేషన్ లో భాగంగా మురళీ నాయక్ (22) నియంత్రణ రేఖ వద్ద దేశం కోసం సేవలు అందిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున రెండున్నర గంటలకు పాక్ సైన్యం జరిపిన కాల్పులకు అమరుడయ్యాడు. బుల్లెట్ తగిలిన వెంటనే విమానంలో ఢిల్లీకి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే కన్నుమూశాడు. దేశం కోసం తన ప్రాణాలు త్యాగం చేసిన మురళీ నాయక్ కు యావత్ భారతావని సెల్యూట్ చేస్తోంది.
వీర జవాను మురళీ నాయక్ అంత్యక్రియలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరవుతున్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన తెలుగు వీరుడు మురళీ నాయక్ కు కడసారి వీడ్కోలు పలికేందుకు తరలి వస్తున్నారు.
Comments
Post a Comment