నెలాఖరులో బీఆర్ఎస్‌లో చీలిక - జోస్యం చెప్పిన బీజేపీ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి
ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ను చీలికలు, పీలికలు చేసేంతవరకు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీలు ఊరికే ఉండేట్లు లేవు. ఎలాగైనా సరే కారుపార్టీలో చీలికలు తీసుకురావాలని పై రెండుపార్టీల నేతలు విడివిడిగానో లేకపోతే జాయింటుగానో గట్టి ప్రయత్నాల్లోనే ఉన్నట్లున్నారు. బీఆర్ఎస్ లో తాము కేటిఆర్ చేతిలో పడుతున్న అవమానాలకు కౌంటర్ ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డితో హరీష్, కవిత చేతులు కలుపుతున్నారని చెప్పుకొచ్చారు.
బీఆర్ఎస్ లో కీలక నేతల మధ్య రాజకీయ విభేదాలు కొద్ది రోజులుగా కొనసాగుతున్నాయే తప్ప కొలిక్కి రావడం లేదని.. రజతోత్సవ సభ నిర్వహణలో పెత్తనమంతా తండ్రీ, కొడుకులదే కావడం, కూతురు, మేనల్లుడు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారన్నారు.
కేసిఆర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అనారోగ్యంతో పాటు ఇతరత్రా కారణాల వల్ల రాజకీయంగా క్రియాశీలకంగా లేరు. రజతోత్సవ సభలో మాట్లాడారే తప్ప అంత చురుగ్గా లేరు. పార్టీ నిర్వహణ బాధ్యతలను వర్కింగ్ ప్రసిడెంటు అయిన కేటిఆర్ చూస్తున్నారు. స్వయంగా కేసిఆరే పార్టీ నేతలకు కేటిఆర్ ను కలవండని చెప్తున్నారు. కవిత, హరీష్ రావులను పట్టించుకోవడం లేదని మహేశ్వర్ రెడ్డి తెలిపారు.
బీఆర్ఎస్ లో పెత్తనమంతా కేటిఆర్ దే అనే సంకేతాలను కేసిఆర్ తమ పార్టీ క్యాడరుకు ఇచ్చినట్లయింది. ఇలా అయితే పార్టీలో తమ పరిస్ధితి ఏంటి అని హరీష్ రావు, కవితలు ఇద్దరూ కేసిఆర్ ను అడిగారట. ఈ నేపధ్యంలోనే బీఆర్ఎస్ లో అంతర్గత కుమ్ములాటలు సాగుతున్నాయని ... కవిత, హరీశ్ రావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని మీడియాలోకథనాలు వచ్చాయన్నారు.
బీఆర్ఎస్ లో తనకు సరైన గుర్తింపు, గౌరవం దక్కడం లేదనేది ఎమ్మెల్సీ కవిత ఆరోపణ. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించడం, మహాత్మ జ్యోతిబా ఫూలే విగ్రహాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో పెట్టాలనే డిమాండుతో బీసీలను చేరదీసేలా ఎమ్మెల్సీ కవిత చేపట్టిన కార్యక్రమాలకు BRS నుండి ఆమె ఆశించిన విధంగా మద్దతు రాలేదు.
సామాజిక తెలంగాణ సాధన, మహిళా సమానత వంటి అంశాల్లో బీఆర్ఎస్ సర్కార్ విఫలమైందంటూ కవిత మాట్లడడం వ్యూహాత్మకమేనన్నారు. కేసిఆర్ పదేళ్ల పాలనలో అవినీతి ద్వారా జమ చేసిన వేలకోట్ల సొమ్మును తన కుమారుడు కేటిఆర్ కే ఇస్తున్నారని, పదవులు, డబ్బులు అన్నీ ఆయనకే ఇవ్వడంతో కవిత తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నారని ఏలేటి చెప్పుకొచ్చారు.
తన మీద కుట్రలు ఎవరు చేస్తున్నారో తెలుసని, ఆర్నెళ్లు జైల్లో ఉన్న తనను ఇంకా కష్టపెడతారా? అని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని బీఆర్ఎస్ పెద్దలు ఖండించాలని, నన్ను రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తాననని కవిత ఒక రేంజ్ లో మాట్లాడారు. కవిత మాటలను బట్టి ఆమెకు బీఆర్ఎస్ తగిన గుర్తింపు, గౌరవం దక్కడం లేదని, పార్టీలో ఇబ్బందిపడుతున్నట్టు స్పష్టమవుతోందన్నారు.
తన సొంత పార్టీ బీఆర్ఎస్ పై కవిత అసంతృప్తి వ్యక్తం చేసిన మరుసటి రోజే అంటే మే 13న హరీష్ రావు తెలంగాణ భవనులోనే మీడియా సమావేశంలో బీఆర్ఎస్ అధ్యక్ష బాధ్యతలు కేటీఆర్ కు అప్పగించినా తనకు అభ్యంతరం లేదని ప్రకటించారు.
కవిత చేసిన కామెంట్సుతో బీఆర్ఎస్ క్యాడరులో గందరగోళం నెలకొంటోందని గ్రహించిన కేసిఆర్, దానిని తగ్గించాలనే ఆలోచనతో, కవిత మాదిరిగా హరీష్ అసంతృప్తిగా లేడని బయటి ప్రపంచానికి చెప్పెందుకే హరీష్ రావుతో ఆ స్టేట్ మెంట్ ఇప్పించారని చెప్పుకొచ్చారు.
బీఆర్ఎస్ శాసనసభాపక్షం చీలుతుందనే భయం కేటిఆర్ ను వెంటాడుతోంది. హరీష్ ను కాదని తాను ప్రతిపక్ష నేత పదవి తీసుకుంటే BRSLPలో చీలిక వస్తుందేమో అనే ఆందోళన కేటిఆర్ ను వెంటాడుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ ను వీడి పది మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పంచన చేరారు.
ఇపుడు హరీష్ వెంట 13 మంది కవిత వెంట నలుగురు మొత్తం 17 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, కాంగ్రెసులో చేరిన వారిని కూడా కలుపుకుంటే వీరంతా కలిసి 27 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఇపుడు కాంగ్రెస్ సర్కారు సహకారంతో హరీష్ రావు BRSLPని చీల్చి ప్రతిపక్ష నేత అవుతారనేది పొలిటికల్ టాక్.
ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి కూడా పూర్తిగా సహకరిస్తారని అది ఒప్పందమని ఏలేటి అంటున్నారు. కౌన్సిల్ లో బీఆర్ఎస్ కు 25 మంది సభ్యులున్నారు. వీరిలో మూడింట రెండు వంతుల ఫార్ములా ప్రకారం ఎమ్మెల్సీ కవిత శిబిరానికి 17 మంది సభ్యులు అవసరం. ఆ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల్లో 17 మంది మద్దతు కవితకు దక్కే ఛాన్స్ ఉందని అంటున్నారు.
Comments
Post a Comment