జర్నలిస్టులపై దాడులు హేయమైన చర్య...

 జర్నలిస్టులపై దాడులు హేయమైన చర్య...

- జర్నలిస్టుల ఐక్యవేదిక.

- ప్రశ్నించే గొంతులపై కేసులా..

- సమాధానం చెప్పలేక ఎదురుదాడులు..

- భద్రాచలం రామాలయ ఈవో, కొంతమంది ఆలయ అధికారులు తీరుపై  సమావేశం...

- దాడులను ఖండించిన జర్నలిస్టుల ఐక్యవేదిక..

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ భద్రాచలం ప్రతినిధి, 

మే 28, 

గత కొంతకాలంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ కార్యనిర్వహణ అధికారి తీరుపై భద్రాచలం జర్నలిస్టులు అత్యవసర సమావేశం జర్నలిస్టుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో బుధవారం  తెలంగాణ హరిత టూరిజం హోటల్ లో నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాత్రికేయులు పూనెం ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ జరుగుతున్న పరిణామాల పై కథనాలు ప్రచురించిన పాత్రికేయుల పై అనేక రకాల బెదిరింపులు, దాడులు చేయడం, కేసులు పెట్టడం సమంజసం కాదని, అధికారులైన, అనధికారులైన ఖండించాల్సిన విషయమేనని, సమస్య పాత్రికేయుని దృష్టికి వస్తే తప్పకుండా వార్త ప్రచురించే హక్కు ఉంటుందని దానిపై వివరణ ఇవ్వకుండా వింత పోకడలు పోవడం ఎవరికీ శ్రేయస్కరం కాదని ఆయన అన్నారు. భద్రాచలం పట్టణంలో పాత్రికేయులపై గత కొంతకాలంగా జరుగుతున్న వివక్షతను, దాడులను ఆయన ఖండించారు. 

సీనియర్ పాత్రికేయులు, మోబగాపు ఆనంద్ మాట్లాడుతూ... మీడియా హక్కులను అడ్డుకునే అధికారం ఎవ్వరికీ లేదని, అక్రమ కేసులు బనాయిస్తే చూస్తూ ఊరుకోమని, మీడియా ఐక్యత కోసం అందరూ కలిసి కట్టుగా వెళ్లాలని, ఆలయ ఈఓ రమాదేవి వైఖరి పై ఉన్నతాధికారులకు వినతిపత్రం అందచేయాలని, సమస్యను సామరస్యంగా సాధించుకోవాలని కోరారు.

 రిపోర్టర్ తమ్మల రాజేష్ మాట్లాడుతూ సమాజంలో పాత్రికేయ రంగంకి ఒక విశిష్టమైన ప్రాముఖ్యత ఉందని అది తెలియకుండా కొంతమంది రిపోర్టర్లను ఇబ్బందులకు గురి చేయడం వారిపై కేసులు పెట్టడం ఎట్టి పరిస్థితుల్లో భావ్యమైన పద్ధతి కాదని, రామాలయ ఈవో  ఇష్టానుసారంగా తనకు నచ్చిన వారికి ఒక విధంగా, తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే తప్పు జరిగితే సరిదిద్దుకోవాల్సింది పోయి కేసులు నమోదు చేపించే కుసంస్కారం పద్ధతి మీడియా పై సరైనది కాదని, దీనిపై భవిష్యత్తులో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహణతో పాటు పై అధికారులకు ఫిర్యాదు కూడా చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. 

రిపోర్టర్ చెట్టి జస్వంత్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా వస్తున్న ఆనవా యితినీ లెక్కచేయకుండా తన ఇష్టానుసారంగా రామాలయ కార్య నిర్వహణ అధికారి తనకు నచ్చిన వారిని దగ్గర పెట్టుకొని వారికి తలంబ్రాలు ఇచ్చి కొంతమంది పాత్రికేయులకు తలంబ్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.

 రామాలయం లో అనేక అవకతవకలు జరిగాయని,  ఆలయంలో పనిచేసే ఓ వేద పండితుడికి సంబంధించి దొంగతనం చేశాడని చెప్పిన ఈవో అతని పై చర్య తీసుకోకుండా అదే వ్యక్తితో కళ్యాణ బ్రహ్మగా  గంటల కొలది ఆలస్యంగా కార్యక్రమం నిర్వహించడం అపచారం కాదా అని ఆయన ప్రశ్నించారు. తలంబ్రాల కొనుగోలులో కూడా లక్షలాది రూపాయలు అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు. 

ఆరోపణ చేస్తే వివరణ ఇచ్చుకోవాలి కానీ పాత్రికేయులను బెదిరించే విధంగా కేసులు పెట్టడం వ్యక్తిగత జీవితాలను ప్రశ్నించే విధంగా నోటీసులు ఇవ్వడం ఎంత వరకు సమంజసం అన్నారు. ఈ విషయంపై జాతీయ, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, ఎస్సీ కమిషన్, హైకోర్టులో ఫిర్యాదులు చేస్తామని, దేవాదాయ శాఖ మంత్రి, కమిషనర్ కు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన అన్నారు. సీనియర్ పాత్రికేయులు తోట మల్ల బాలయోగి మాట్లాడుతూ పాత్రికేయుల పై కేసులు పెట్టడం సమంజసం కాదని, మరోసారి ఇటువంటి సంఘటన జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 

సీనియర్ పాత్రికేయులు కుప్పాల నాగరాజు, పండా ఆనంద్ లు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ అనేక ప్రజా సమస్యలపై తమ పేపర్లలో టీవీలలో ప్రచురిస్తూ సమస్యలను ప్రభుత్వానికి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తున్న పాత్రికేయులపై కేసులు పెట్టడం పాత్రికేయ రంగాన్నే అవమానించడం అవుతుందని, ప్రభుత్వం, అధికారులు జర్నలిస్టులతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉండగా నేడు అందుకు విరుద్ధంగా కొంతమంది ఇబ్బంది పెడుతున్నారనే వార్తలు రావడం మంచి పరిణామం కాదని, మరోసారి ఇటువంటి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా వారిపై ఉందన్నారు. 

సీనియర్ పాత్రికేయులు పిల్లిరాజు,తోకల నాగేశ్వరరావు, పోకల శ్రీనివాస్, మా మురళి, రేపాక రామారావు, , సంతోష్ , రామాచారి, బాల కిరణ్  భూక్య రంజిత్ , భూక్యా సాయి కౌశిక్ లు  మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడిని పెట్టే కేసులను ప్రతి ఒక్కరు ముక్తకంఠంతో ఖండించాలని, తప్పు జరిగితే సరిదిద్దుకోవాల్సింది పోయి ఎదురు దాడి చేయడం మూర్ఖత్వమని, ఆలయ ఈవో వైఖరి సరైనది కాదని తక్షణమే తన పద్ధతి మార్చుకోవాలని డిమాండ్ చేశారు.   మరో పాత్రికేయుడు రాజేంద్ర వర్ధన్ మాట్లాడుతూ తక్షణమే పాత్రికేయలను ఇబ్బంది పెట్టే రామాలయ ఈవోను బదిలీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

ఈ సమావేశానికి భద్రాచలంతో పాటు పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు హాజరయ్యారు.

సమావేశం లో పలువురు జర్నలిస్టులు తమ సమస్యలను స్పష్టంగా వ్యక్తపరిచారు. వారు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించుతూ, జర్నలిస్టుల ఐక్యత, రక్షణ, గౌరవం, భద్రత చాలా అవసరమని హితవు పలికారు. ముఖ్యంగా భద్రాచలం రామాలయం ఈవో రమాదేవి, మరియు కొంతమంది ఆలయ అధికారులు వ్యవహార శైలిపై తీవ్ర ఆవేదన వ్యక్త పరిచారు.

జర్నలిస్టుల పై పెట్టబడుతున్న అక్రమ కేసులపై వ్యతిరేకంగా తీర్మానం చేయగా, ఈ సమస్యలను ఎదుర్కొనడంలో ఒకటిగా ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఎవ్వరైనా జర్నలిస్టులపై అక్రమంగా వ్యవహరిస్తే, వారిపై తగిన చర్యలు తీసుకునే విధంగా కార్యాచరణ రూపొందిస్తామని నిర్ణయించారు.

ఈ సమావేశంలో సీనియర్ జర్నలిస్టులతో పాటు వివిధ మీడియా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Comments