కరాచీ పేరు మార్పు కోసం బేకరీపై బీజేపీ దాడి

 *కరాచీ పేరు మార్పు కోసం బేకరీపై బీజేపీ దాడి* 

 *శంషాబాద్‌లో ఘటన.. కేసు నమోదు* 

 *కరాచీ బేకరీపై దాడి హేయం: మంత్రి సీతక్క* 

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో గల బేకరీకి గల కరాచీ పేరు మార్చాలని కోరుతూ ఆ బేకరీపై బీజేపీ నేతలు దాడి చేసిన ఘటన రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

 సీఐ బాల్‌రాజ్‌ తెలిపిన వివరాల ప్రకారం పాకిస్తాన్‌లోని కరాచీ పట్టణం పేరుతో మనదేశంలో బేకరీ ఉండకూడదని శనివారం కొందరు బీజేపీ నాయకులు ఆ బేకరీపై దాడి చేశారు. దాని పేరు మార్చాలని డిమాండ్‌ చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

పాకిస్తాన్‌ ముర్దాబాద్‌, భారత్‌ జిందాబాద్‌ అని నినాదాలు చేశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బీజేపీ నేతలను సముదాయించి.. బేకరీ పేరు కనబడకుండా నల్లని బట్ట కప్పడంతో సమస్య సద్దుమణిగింది. బేకరీ మేనేజర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

రాజకీయ లబ్ధి కోసం విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: మంత్రి సీతక్క

కరాచీ బేకరీపై బీజేపీ నేతలు దాడి చేయడం హేయమైన చర్య అని మంత్రి ధనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసం విద్వేషాలు రెచ్చగొట్టడం తగదని ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. దేశ విభజన సమయంలో హిందువులైన కరంచంద్‌ కుటుంబం హైదరాబాద్‌కు వచ్చి స్థిర పడటంతోపాటు కరాచీ బేకరీ స్థాపించారని తెలిపారు. 


ఈ దేశ బిడ్డలదే కరాచీ బేకరీ అని స్పష్టంచేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సొంత రాష్ట్రం గుజరాత్‌తోపాటు పలు రాష్ట్రాల్లో వ్యాపా రం నిర్వహిస్తున్న కరాచీ బేకరీపై బీజేపీ నేతల దాడి సరికాదన్నారు. కరాచీ బేకరీకి ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని సీతక్క వెల్లడించారు.. 

Comments